Thursday, January 27, 2011

ఆకుకూరల సాగు .... అపార్ట్‌మెంట్లలో... ఇంటి పంట.

నగరాలు, పట్టణాలు...
అపార్ట్‌మెంట్లలో...
కుండీలు,
కంటెయినర్లలో..

వంగ, టమాటా వంటి కూరగాయలు కూడా పెంచవచ్చు
కుండీల్లోనూ చక్కని దిగుబడి తీయొచ్చు
ర్యాక్‌లతో తక్కువ చోటులోనే ఎక్కువ కుండీలు పెట్టొచ్చు

నగరాలు, పట్టణాలలో జనాభా సాంద్రత అంతకంతకూ ఎక్కువవుతోంది. ఇళ్లు, బహుళ అంతస్థుల గ్రూప్ హౌస్‌లు లేదా అపార్ట్‌మెంట్ల వద్ద ఖాళీ స్థలం తక్కువగా ఉంటుంది.

కంటికి మట్టి కనపడకుండా అంతా గచ్చుమయంగా ఉండే ఇటువంటి చోట్ల ఆకుకూరలు, కూరగాయలు పెంచుకోవడం అసాధ్యమని అనిపించడం సహజం. అయితే, అందుకు అనేక మార్గాలున్నాయి. ఇంటి యజమానులకే కాదు, అద్దె ఇంట్లో ఉండే వారితోపాటు పల్లెవాసులు సైతం కుండీలు, కంటెయినర్లలో మొక్కలు పెంచుకోవచ్చు. ఇంటి ముందు, వెనుక, బాల్కనీలో, మేడ మీద.. కిచెన్ గార్డెన్ పెంచవచ్చు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు కూడా.

మొక్కను బట్టి కుండీ: ఆకు కూరలు పెంచడానికి వెడల్పు ఎక్కువ, లోతు తక్కువ కుండీలు, కంటెయినర్లు సరిపోతాయి. కూరగాయ మొక్కలు, క్యారట్ వంటి దుంప జాతి మొక్కలు పెంచుకోవాలంటే లోతు ఎక్కువగా ఉండే కుండీలు, కంటెయినర్లు ఎంచుకోవాలి. ఆకు కూరలు పెంచుకోవాలంటే కనీసం 4 అంగుళాల లోతు మట్టి పట్టే వెడల్పాటి కుండీలు లేదా అంత లోతుండే బల్లపరుపు ట్రేలను ఎంచుకోవాలి.

వంగ, చిక్కుడు, టమాటా వంటి కూరగాయలు, బీర, పొట్ల వంటి తీగజాతి కూరగాయలు పెంచుకోవాలంటే 4 నుంచి 6 అంగుళాల లోతు మట్టి ఉండే కుండీలు, ట్రేలను ఎంపికచేసుకోవాలి. క్యారట్, ముల్లంగి వంటి దుంప జాతి మొక్కలు పెంచుకోవాలంటే మరికొంత లోతు ఉండే కుండీలు, కంటెయినర్లు ఎంచుకోవాలి.

కుండీలు: సిమెంటు, మట్టి, ప్లాస్టిక్ కుండీల్లో కూరగాయలు పెంచవచ్చు. చెక్కతో చేసిన పెట్టెలు, ప్లాస్టిక్ జార్లు, క్యాన్లు, బక్కెట్లు, టిన్ బాక్సులు, డ్రమ్ములలో మొక్కలు నిక్షేపంగా పెంచుకోవచ్చు.

అంతేకాదు అల్యూమినియం లేదా ఫైబర్‌తో తయారుచేసిన నలుచదరపు కంటెయినర్లలోనూ పెంచుకోవచ్చు. కుండీలతో ఉండే సౌలభ్యం ఏమిటంటే ఎంత సైజులో కావాలంటే అంతసైజువి ఎంపికచేసుకోవచ్చు. ఏ కుండీలో ఏ మొక్కలు పెంచదలచుకున్నామన్న దాన్ని బట్టి... కుండీ షేపు, లోతు, వెడల్పు, సైజు ఎంత ఉంటే బావుంటుందన్న విషయం నిర్ధారించుకోవచ్చు.

తగుమాత్రంగానే నీరు: మొక్కలకు తగుమాత్రంగానే నీరు పోయాలి. కుండీలో మట్టి బాగా తడిగా ఉంటే ఆ రోజుకు నీరు పోయనక్కర లేదు. మట్టి తేమగా ఉంటే చాలు. మరీ నీరు ఎక్కువైనా మొక్క చనిపోతుంది. అతి జాగ్రత్తగా నీరు మరీ ఎక్కువ పోస్తే.. నాటిన చేతులతో మనమే మొక్కను చంపుకున్నవాళ్లమవుతాం.

నిలువ నీరు హానికరం: ఎక్కువైన నీరు కుండీలో లేదా కంటెయినర్‌లో నిలవకుండా చూసుకోవాలి. ఇందుకోసం కుండీ లేదా కంటెయినర్ అడుగున కనీసం ఒక రంధ్రమైనా ఉండాలి. సాధారణంగా కుండీకి రెండు, మూడు రంధ్రాలుంటాయి. పొడవాటి ట్రేలు, కంటెయినర్లకు మరిన్ని రంధ్రాలు పెట్టాలి. కుండీలో నీరు నిల్వ ఉంటే ఎక్కువ సేపు తేమ ఉంటుంది అని అనుకోవడం మొక్క మనుగడకే ప్రమాదం. మొక్కల పనులు చేయాలంటే పిల్లలు సరదా పడుతుంటారు. ఏ కుండీలో ఎంతెంత నీరు పోయాలో పిల్లలకు నేర్పండి. మర్చిపోకుండా క్రమం తప్పకుండా పోస్తారు. తాము పోసిన నీరుతో మొక్క రోజుకో తీరున పెరుగుతుంటే చూసి వారు పొందే ఆనందం అంతా ఇంతా కాదు.

ఒకే కుండీలో రెండు రకాల మొక్కలు: కుండీ ఒకటే అయినా రెండు రకాల మొక్కలు పెంచుకోవచ్చు. ఉదాహరణకు... వంగ మొక్కలు రెండు ఒక కుండీలో పెట్టామనుకోండి. అది రెండు జానల ఎత్తు పెరిగిన తర్వాత... అదే కుండీలో వంగ మొక్క చుట్టూ ఉండే ఖాళీలో కొత్తిమీర, పుదీన, మెంతి కూర, అల్లం... వంటి ఎత్తు తక్కువ పెరిగే మొక్కలేవైనా వేసుకోవచ్చు.

తక్కువ చోటులో ఎక్కువ కుండీలు: కుండీలు ఇండిపెండెంట్ ఇళ్లు లాంటివి. ఇంటి దగ్గర ఉన్న కొంచెం ఖాళీ కొన్ని కుండీలతోనే నిండిపోతుంది. అలాంటప్పుడు అపార్ట్‌మెంట్ల మాదిరిగా బహుళ అంతస్థుల్లో మొక్కలు పెంచుకునే ఉపాయం ఆలోచించవచ్చు. చెట్టు ఆకారంలో ఇనుప చువ్వలతో ర్యాక్ చేయించుకుంటే... ఒకటి రెండు కుండీలు పట్టే చోటులోనే ఐదారు కుండీలు మోసే ‘ఇనుప చెట్టు’లాంటి ర్యాక్‌ను పెట్టుకోవచ్చు.

మీ ఇంటి పరిసరాలను దృష్టిలో ఉంచుకొని.. మీకు అందుబాటులో ఉన్న మెటీరియల్‌తో.. మరో విధంగా ఏమైనా చేయొచ్చేమో కూడా ఆలోచించండి.

మట్టి.. ఎరువులు: నాణ్యమైన మట్టి, సేంద్రియ ఎరువుల మిశ్రమాన్ని వినియోగిస్తే కూరగాయ మొక్కలు పోషకలోపం లేకుండా చక్కగా పెరిగి మంచి దిగుబడినిస్తాయి.

కుండీలో మట్టి పిడచగట్టుకు పోకుండా ఉంటే మొక్క చక్కగా పెరుగుతుంది. నల్లమట్టికి గట్టిపడే స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి ఎరమ్రట్టిని వినియోగించడం మంచిది. ఎరమ్రట్టి బొత్తిగా దొరకనప్పుడు నల్లమట్టిని తక్కువ పాళ్లలో వాడుకోవచ్చు. కూరగాయలు, ఆకుకూరల పెంపకానికి సేంద్రియ ఎరువులు, సేంద్రియ పురుగుమందుల వాడకం ఉత్తమం. ఎరమ్రట్టికి, పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు సమపాళ్లలో కలిపి మొక్కలు పెంచవచ్చు. వేప గింజల పిండి, కానుగ పిండి, సీతాఫలం గింజల పిండి కూడా కలిపితే చీడపీడలను నివారించుకోవచ్చు.

కొబ్బరి పీచుతో...: కొబ్బరి పీచు తీసినప్పుడు వచ్చే పొట్టు కూడా చక్కని సేంద్రియ ఎరువే. మట్టి లేకుండా కేవలం కొబ్బరి పొట్టును వాడి ప్లాస్టిక్ ట్రేలలో నారు పెంచుతున్నారు. 40 రోజులపాటు ఆరోగ్యంగా మొక్కలు పెరుగుతున్నాయి. అంటే.. ఆకుకూరలు కూడా ఈ ట్రేలలో కొబ్బరి పీచుతో పెంచుకోవచ్చు.

కంపోస్టుతోనే..: మట్టితో పని లేకుండా వట్టి కంపోస్టుతో కూడా కూరగాయలు, ఆకుకూరల మొక్కలు పెంచుతున్నారు. మట్టితో పెంచినదానికన్నా కనీసం 3 రెట్లు అధిక దిగుబడి వస్తున్నదని అనుభవజ్ఞులు చెప్తున్నారు. కంపోస్టుతో జీవన ఎరువులు కలిపిన మిశ్రమంతోనూ ఆకు కూరలు, కూరగాయలు పెంచుకోవచ్చు.

విత్తనాలు: విత్తనాలు దుకాణాల్లో చిన్న ప్యాకెట్లలో కూడా అమ్ముతున్నారు. ఇరుగుపొరుగు వారి వద్ద నుంచో,పెరటి తోటలు పెంచే వారి దగ్గరి నుంచో సేకరించుకోవచ్చు. తోటకూర వంటి అతిచిన్న విత్తనాలను ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు. మొత్తం మడిలా చల్లవచ్చు లేదా సాళ్ల మాదిరిగా చల్లవచ్చు.

ఆకుకూరలు సాధారణంగా చల్లిన నెల రోజుల్లో కోతకు వస్తాయి. పాలకూర, బచ్చలి కోస్తే మళ్లీ మొలకలు పెరుగుతాయి. తోటకూర కూడా మొలకలు పెరుగుతాయి. కానీ అంత నాణ్యంగా రావని అంటుంటారు. గోంగూర మొక్క నుంచి నెలల తరబడి ఆకులు కోసుకోవచ్చు.

ఏడాది పొడవునా పెంచవచ్చు: కూరగాయలు, ఆకుకూరలను ఏడాది పొడవునా పండించవచ్చు. అన్ని రకాల ఆకుకూరలు, వంగ, టమాటా, బెండ, క్యాప్సికమ్, మిరప, బీట్‌రూట్, క్యాలీఫ్లవర్, పుచ్చ... రకాలను నిశ్చింతగా సాగుచేయవచ్చు. కొత్తిమీర, కరివేపాకు, పుదీన వంటి వాటి గురించి ఇక ఆలోచించాల్సిన పనే లేదు.
ఎండ: అయితే.. ఏ మొక్కలకైనా ఎండ తగిలితేనే చక్కగా పెరుగుతాయి. రోజుకు కనీసం 5, 6 గంటల సేపైనా ఎండ తగిలే విధంగా కుండీలు, కంటెయినర్లను ఏర్పాటు చేసుకోవాలి.

ప్రతి 15 రోజులకోసారి మట్టిని గుల్లపరిచి గుప్పెడు వర్మీ కంపోస్టు లేదా పశువుల ఎరువు వేస్తే మంచిది. పంచగవ్య, వర్మివాష్ వంటి ద్రావణాలను 15 రోజలకోసారి చల్లితే చీడపీడలు దరిచేరవు.. పోషకాలు కూడా అందుతాయి.

ఏవైనా పురుగులు కనిపిస్తే వాటిని ఓపిగ్గా ఏరేయండి. ఒక కొమ్మకు తెగులు సోకితే ఆ కొమ్మ వరకూ కట్ చేసి నాశనం చేయడం శ్రేయస్కరం. ఎండలు ముదురుతున్నాయి కదా అని సందేహించకండి. ఏడాది పొడవునా అన్నికాలాల్లోనూ ఆకుకూరలు, కూరగాయలు పెంచుకోవచ్చు.

No comments: