Monday, February 14, 2011

మేడపైనే కొన్ని కుండీలు.. ఆకుకూరల మడి..* ఇంటిల్లిపాదికీ కూరగాయలు - సికింద్రాబాద్‌లో ఓ కుటుంబం ప్రత్యేకత


మహానగరంలో నివసించేవారు సైతం కొంచెం శ్రద్ధ ఉంటే చాలు ఆకుకూరలు, కూరగాయలను ఇంటి వద్దే పండించుకోవడం ఆరోగ్యదాయకమని అంటున్నారు రామిశెట్టి మురళి, రమా జ్యోతి దంపతులు (98497 99048). వరంగల్ జిల్లాకు చెందిన మురళి సికింద్రాబాద్‌లోని ఉప్పల్ ప్రశాంత్ కాలనీలో స్థిరపడ్డారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులతోపాటు కలుషిత వ్యర్థ నీటిని వినియోగించి పండిస్తున్న ఆకు కూరలు, కూరగాయలను మార్కెట్లో కొనుక్కొని తినడం ఆరోగ్యానికి హానికరమని గ్రహించి ఇంటి వద్దే సేంద్రియ సేద్యానికి ఉపక్రమించారు. స్వగృహంపైనే కొన్ని కుండీలతోపాటు ప్రత్యేకంగా ఆకుకూరల మడిని ఏర్పాటు చేసి.. కొనాల్సిన అవసరం లేకుండా.. పుష్కలంగా పండిస్తున్నారు.

వంగ, బెండ, టమాటా, చిక్కుడు...
ఇంటికి దగ్గర్లోనే ఉన్న ఖాళీ స్థలంలో కూడా వంగ, బెండ వంటి కూరగాయ మొక్కలు, ఉసిరి, దానిమ్మ, జామ తదితర ఫల వృక్షాలను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తోటకూర, పాలకూర, చుక్కకూర, టమాటా, చిక్కుడు, దోస, మిరప, కొత్తిమీర, పుదీన, కరివేపాకు, ఉల్లి బొందులు లేదా ఉల్లి కాడలు, గుమ్మడి తదితర పంటలు పండించుకుంటున్నారు. కొన్ని పూల మొక్కలు కూడా చక్కగా పెరుగుతున్నాయి. పాలకూర పెరిగినంత వేగంగా చుక్కకూర పెరగడం లేదన్నారు. ఎరమ్రట్టిలో కొంత మేరకు వర్మీ కంపోస్టు కలిపి మొక్కలు పెంచుతున్నామని మురళి తెలిపారు. గత మూడు నెలల్లో ఆకు కూరలు, టమాటాలు, కొత్తిమీర, పుదీన కొనాల్సిన అవసరం తమ (నలుగురు) కుటుంబానికి రాలేదన్నారు. వీటిని ఇరుగుపొరుగువారు, స్నేహితులు, బంధువులతో కూడా పంచుకుంటున్నామని, ఇది చాలా సంతృప్తినిస్తోందని రమాజ్యోతి అన్నారు. ప్రతి కుండీలోనూ రెండు మూడు రకాలను సాగుచేస్తున్నారు.

వంటింటి వ్యర్థాలతోనే కంపోస్టు
కంపోస్టు ఎరువును మొదట్లో కొన్నారు. ఆ తర్వాత ఇంట్లోనే కుళ్లడానికి అవకాశం ఉన్న వ్యర్థపదార్థాలతో కంపోస్టును తయారుచేస్తున్నారు. వంటింట్లో చెత్త కోసం రెండు పాత్రలు పెట్టారు.

కుళ్లడానికి అవకాశం ఉన్న కూరగాయల పండ్ల తొక్కలు, పుచ్చకాయ ముక్కలు, ఆకులు అలములు, వాడిన టీపొడి, పుచ్చిన, పాడైన కూరగాయలు వంటి వ్యర్థ ఘన పదార్థాలన్నీటినీ ఒక పాత్రలో వేస్తున్నారు. వీటిని ఇంటి బయట మూలన ఏర్పాటుచేసిన పాత బక్కెట్‌లో వేస్తున్నారు.

క్రమంగా అదే కుళ్లి కంపోస్టుగా మారుతోందని, నెలకోసారి తీసి మొక్కల కుండీల్లో వేస్తున్నామని మురళి చెప్పారు. పప్పులు, బియ్యం కడిగిన నీళ్లు వేరే బక్కెట్‌లో పోసి ఏరోజుకారోజు మొక్కలకు పోస్తున్నారు. చెత్తను కంపోస్టుగా మార్చుతూ.. ఆ ఎరువుతో మొక్కలు పెంచుతున్నారు. పాత స్నానపు తొట్టె ఏదైనా దొరికితే కంపోస్టు బెడ్‌ను మేడ మీద నీళ్ల ట్యాంకు అడుగున ఏర్పాటు చేద్దామనుకుంటున్నామని మురళి అన్నారు.

రసాయనాలు వాడలేదు
చిక్కుడుకు పేను సోకితే రసాయనిక పురుగుమందులు వాడలేదని, వావిలాకు కషాయం చల్లామన్నారు. వేప చెక్క(నీమ్ కేక్)ను రోజంతా నానబెట్టి ఆ కషాయాన్ని మొక్కలపై చల్లితే మట్టి ద్వారా వచ్చే తెగుళ్లు పోతాయని, మొక్కకు పోషకాలు కూడా అందుతాయని అన్నారు.

మేడపై మడితో ఇబ్బందేమీ లేదు

మేడపైన 4 అడుగుల వెడల్పు, 15 అడుగుల పొడవు గల ఆకు కూరల మడిని మురళి, రమాజ్యోతి దంపతులు ఏర్పాటు చేసుకున్నారు. చుట్టూ రెండు ఇటుకల ఎత్తున (6 అంగుళాలు) సిమెంటుతో కట్టించి.. ఎరమ్రట్టి మూడొంతులు, ఒక వంతు వర్మి కంపోస్టు, కొద్ది మొత్తంలో వేప పిండి కలిపి మడిని ఏర్పాటుచేశామని మురళి చెప్పారు.

వర్షాకాలంలో ఈ మడి వల్ల ఇంటి స్లాబ్ నుంచి గదిలోకి ఏమైనా ఊట దిగడం వంటి సమస్యేమీ రాలేదన్నారు. మడి అడుగున ప్లాస్టిక్ షీట్ కూడా వేయలేదన్నారు. శ్లాబ్ సాధారణంగా 6 అంగుళాల మందానే వేశామన్నారు. మడిలో మూడు నాలుగు రకాల ఆకు కూరలు సాగుచేస్తున్నారు. ప్రతి ఆకుకూర నాలుగు రోజులకోసారి కోతకొస్తున్నాయని, చెట్టును పీక కుండా పెరిగిన ఆకులను తెంపుకుంటున్నామని రమాజ్యోతి చెప్పారు. ఒకసారి విత్తనాలు వేస్తే మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుందన్నారు.

కూరగాయల మడి.. పెట్టుకుందామా?


పట్నమైనా, పల్లె అయినా.. పెరట్లోనో, మేడ మీదో ఇంటిల్లిపాదికీ వంటకు సరిపోయే కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవాలనుకుంటే.. కొన్ని కుండీలతో పాటు ఒకటో రెండో మడులు కూడా ప్రతి ఇంటి వద్దా ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఇంట్లో కూరగాయల వాడకాన్ని బట్టి ఎన్ని కుండీలు, ఎన్ని మడులు అవసరమవుతాయో ఏ కుటుంబానికి ఆ కుటుంబమే గ్రహించాలి.

అవసరమయ్యే మొత్తం ఒకేసారి పండించుకోలేకపోయినా.. వీలున్నంతలో ముందు ఒక మడి ఏర్పాటుచేసుకోవడానికి ప్రయత్నించండి. విష రసాయనాల్లేకుండా పెరిగిన ఇంటి పంట రుచి తెలిశాక.. ఇంట్లోకి పూర్తిగా సరిపోను ఇంటిపట్టునే పండించుకునే ఏర్పాటు చేసుకోవచ్చు.


మడి 4 అడుగుల వెడల్పుంటే చాలు..

పెద్ద వారికి రోజుకు 300 గ్రాముల కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు అవసరం. పోషక విలువల రీత్యా దుంపలు, కూరగాయలకన్నా ఆకుకూరలే కాస్త ఎక్కువ తీసుకోవాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మడుల్లో అధిక స్థలం ఆకుకూరల పెంపకానికి కేటాయించుకోవడం ఉత్తమం. కూరగాయల మడి వెడల్పు 4 అడుగులు ఉంటే చాలు. మడి దగ్గర కూర్చొని చేయి చాపితే.. మడి అవతలి అంచు అందేలా ఉంటే చాలు. ఉన్న చోటును బట్టి మడి వెడల్పు తగ్గించుకోవచ్చు. పొడవు ఎంతైనా పెట్టుకోవచ్చు.

మేడపై మడి ఇలా..

పెరట్లో వేసే మడులకు, ఇంటిపైన పెట్టుకునే మడులకు చిన్న తేడా ఉంది. పెరట్లో (అంటే నేల మీద) ఏర్పాటు చేసుకునే మడికి.. వర్షపు నీటి కోత నుంచి ప్రత్యేక రక్షణ అవసరం. మేడ మీద పాలిథిన్ షీట్ పరిచి.. దానిపై చుట్టూ మూడు వరుసలు ఇటుకలు పేర్చి.. మట్టి, కంపోస్టు తదితరాలతో ప్రత్యేకంగా సిద్ధంగా చేసుకున్న మట్టి మిశ్రమాన్ని పోస్తే.. మడి సిద్ధమైనట్టే.

పెరట్లో మడి ఇలా..

పెరట్లో మడిని ఏర్పాటు చేసుకునే స్థలాన్ని గుర్తించిన తర్వాత.. ఆ స్థలంలో ఇటుకలను బల్లపరుపుగా పరవాలి. ఆ ఇటుకల పైన.. చుట్టూ అంచుల్లో ఒక వరుస ఇటుకలు పేర్చాలి.

ఆ ఇటుక మేరకు 3 అంగుళాల మందాన మామూలు మట్టి పోయాలి(ఈ మట్టి మడి అడుగున దన్నుగా ఉండడానికి మాత్రమే. అందులో మొక్కలు వేసేదేమీ ఉండదు. ఆపైన వేసే మట్టి మిశ్రమంలోనే మొక్కలను సాగు చేస్తామన్న మాట). ఆ మట్టిపైన పాలిథిన్ షీట్ పరవాలి. వర్షపు నీరు ఉధృతంగా మడి సమీపంలో పారినా.. మడి అడుగున మట్టి కోసుకుపోకుండా ఈ ఏర్పాటు చేసుకోవాలి. అలా పరచిన పాలిథిన్ షీట్‌పై చుట్టూ అంచుల్లో రెండు వరుసలు ఇటుకలు పేర్చాలి. మధ్యలో మట్టి మిశ్రమాన్ని పోస్తే.. పెరట్లో మడి సిద్ధమైనట్టే.


ఇటుకలే వాడాలనేం లేదు..

కొందరు ఇటుకలకు బదులు పల్చని చెక్కలు, బంగళా పెంకులు, నాపరాళ్లు.. ఏవి అందుబాటులో ఉంటే వాటిని అమర్చుకొని కూరగాయల మడులు సిద్ధం చేసుకుంటున్నారు. మనం ఏ మెటీరియల్ వాడినా.. నేలపై ఏర్పాటు చేసుకునే మడికి అడుగున వర్షపు నీటి ఉధృతిని తట్టుకునేలా ప్రత్యేక జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. మేడపై మడికి అడుగున పాలిథిన్ షీట్ వేస్తే చాలు. అడుగున గచ్చు ఉంటుంది కాబట్టి... అడుగున మట్టి కోసుకుపోవడమనే సమస్య మేడపై మడికి ఉండదు.

పాలిథిన్ షీట్‌కు బెజ్జాలు పెట్టాలి..

మడిలో మట్టి మిశ్రమానికి అడుగున వేసే పాలిథిన్ షీట్‌కు ముందుగానే అక్కడక్కడా దబ్బళంతో బెజ్జాలు పెట్టాలి. ఈ బెజ్జాలు ఎందుకంటే.. మడిలో మొక్కలకు తగు మాత్రంగా పోస్తే చాలు. మడిలో నీరు నిల్వ ఉంటే మొక్కలకు ముప్పు పొంచి ఉన్నట్టే. నీరు మడిలో ఏమాత్రం నిలబడిపోకూడదు. మిగిలిపోయే నీరు ఎప్పటిది అప్పుడు కిందికి వెళ్లిపోయే ఏర్పాటు.. కుండీకైనా.. మడికైనా ప్రాణావసరం. పాలిథిన్ షీట్‌కు జానకు ఒక చోట దబ్బళంతో బెజ్జం పెడితే సరిపోతుంది.

రెండేళ్ల వరకూ మడికి ఖర్చేమీ ఉండదు..

ఎరమ్రట్టి, కంపోస్టు (లీఫీ మౌల్డ్.. అంటే ఆకు ఎరువు లేదా వర్మీ కంపోస్టు), కొబ్బరి పొట్టు, వర్మిక్యులైట్, వేప పిండి.. తగిన పాళ్లలో కలుపుకొని మట్టి మిశ్రమాన్ని సిద్ధం చేసుకొని మడిలో వినియోగించాలి. రెండేళ్ల వరకూ ఈ మట్టి మిశ్రమంలో వరుసగా పంటలు పండించుకోవచ్చు. సకల పోషకాలు పుష్కలంగా ఈ మట్టి మిశ్రమంలో ఉంటాయి. కాబట్టే, మామూలు మట్టిలో కన్నా.. మట్టి మిశ్రమంలో పెరిగే మొక్కలు కనీసం 3 రెట్లు పంట దిగుబడులు వస్తాయి.

Friday, February 4, 2011

గజం స్థలంలో 288 మొక్కలు

ఇది ‘పెరటి మొక్కల పొద’ మ్యాజిక్
ముచ్చటగొలుపుతున్న ‘పెరటి మొక్కల గోడ’!
అర్బన్ కిచెన్ గార్డెన్‌కు
అధునాతన అన్‌బ్రేకబుల్ కుండీల సొబగు


నాలుగు కూరగాయ మొక్కలో, ఆకుకూరలో ఇంటి పట్టున పెంచుకుందామంటే పెద్దగా చోటు లేదని చింతిస్తున్నారా? బాల్కనీలో ఉన్నదల్లా రెండు గజాల స్థలమే. ఆ కాస్త ఖాళీలో ఎన్ని కుండీలు పెట్టగలం.. ఎంతని ఆకుకూరలు పెంచగలం అననుకుంటున్నారా..?

ఇదుగో చక్కటి ఉపాయం... వర్టికల్ పెరటి తోట!

అరకిలో బరువుండే చిన్న చిన్న ప్లాస్టిక్ కుండీలు ఉంటాయి. వాటిని పట్టి ఉంచడానికి కొన్ని ప్లాస్టిక్ ఫ్రేమ్‌లు ఉంటాయి. వీటిని ఉపయోగించి ఎవరికి వారు ‘పెరటి మొక్కల పొద’ (బయో వాల్)లను, ‘పెరటి మొక్కల గోడ’ (గ్రీన్ వాల్)లను పదంటే పది నిమిషాల్లో సృష్టించుకోవచ్చు.
ఆకారం, ఎత్తు, పొడవు, వెడల్పు.. ఎలా కావాలంటే ఆ విధంగా కుండీలను అమర్చుకునే వీలుంది. గుండ్రంగా పొద మాదిరిగా ఫ్రేమ్స్‌ను కలిపి, చుట్టూ ప్లాస్టిక్ కుండీలు తగిలించవచ్చు. లేదంటే ప్లైవుడ్‌కు ఈ ఫ్రేమ్స్‌ను కోరిన వెడల్పు, ఎత్తు, పొడవులలో సులువుగా బిగించుకోవచ్చు. తర్వాత చిటికెలో కుండీలు తగిలించవచ్చు.

వారానికో, నెలకో.. మీకు తోచినప్పుడు ఈ ఫ్రేమ్స్‌ను మార్చి.. మీ అత్యాధునిక పెరటి తోటకు పది నిమిషాల్లో కొత్త రూపు దిద్దుకోవచ్చు. ఈ మార్పులన్నీ నిపుణులెవరో వచ్చి చెయ్యక్కర్లేదు. ఫ్రేమ్‌ల అమరికను ఒక్కసారి పరికించి చూస్తే చాలు.. ఎవరికివారే పెరటి తోటను బిగించుకోవచ్చు!

అన్నిటికీ మించి.. ప్రస్తుతం కొద్ది రోజులు ఏ పెరటి తోటా వద్దు అనుకుంటే... ఫ్రేమ్‌లను, కుండీలను తీసేసి.. ప్యాక్‌చేసి అటకపై దాచిపెట్టుకోవచ్చు. మళ్లీ ఎప్పుడంటే అప్పుడు పది నిమిషాల్లో బిగించుకొని.. ఆకుకూరల విత్తనాలో, కూరగాయల విత్తనాలో చల్లుకోవచ్చు. మధ్యలో పూలమొక్కలూ పెట్టుకోవచ్చు.

సులువుగా మార్చుకోవచ్చు

ఇంటి పెరటిలోనో, ఇంటి పైనో, అపార్ట్‌మెంట్ల బాల్కనీల్లో.. ఎక్కడ అవసరమైతే అక్కడ ఈ బయో వాల్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటి హాల్‌లో (నీడ పట్టున) అందంగా ‘ఫ్రేమ్ గార్డెన్’ను గోడకు వేలాడదీయొచ్చు. అటువంటి ఫ్రేమ్‌లు మరి కొన్నిటిని ఆరుబయటో, బాల్కనీల్లోనో (ఎండ తగిలే చోట) ఏర్పాటు చేసుకోవచ్చు. మూడు రోజులు నీడ పట్టున ఫ్రేమ్‌లకు ఉన్న మొక్కల కుండీలను ఎండ తగిలే చోటుకు తరలించి.. ఎండ తగిలే చోట ఫ్రేమ్‌లకు ఉన్న మొక్కల కుండీలను నీడపట్టున ఫ్రేమ్‌లకు అతి సులువుగా తగిలించుకోవచ్చు.

ముంబైకి చెందిన జేకేడీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ఈ సరికొత్త ఆలోచనతో అర్బన్ గార్డెనింగ్ గ్రీన్ వాల్‌కు రూపకల్పన చేసింది. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఉద్యాన ఎక్స్‌పోలో ఈ ఫ్లెక్సిబుల్ వర్టికల్ గార్డెన్ సిస్టమ్స్‌ను దేశంలోనే మొట్టమొదటి సారిగా జేకేడీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ప్రదర్శించింది.

6 అంగుళాల కుండీ!

అర్బన్ గార్డెనింగ్ గ్రీన్ వాల్‌లో ఫ్రేమ్‌కు అమర్చే కుండీ చేతిలో అమిరిపోయేంత చిన్నది. దీని లోతు 6 అంగుళాలు, వెడల్పు 4 అంగుళాలు. మట్టి, మొక్కతో కలిపి ఒక్కో కుండీ బరువు అర కేజీకి మించదు. ఒక్కో ఫ్రేమ్‌కు 3 కుండీలుంటాయి. అటువంటి ఫ్రేమ్‌లను ఎట్లా కావాలంటే అట్లా అమర్చుకోవచ్చు.

కొబ్బరి పొట్టు ఎరువు బెస్ట్

శుద్ధిచేసిన కొబ్బరి పొట్టు ఎరువును వాడి నిక్షేపంగా మొక్కలు పెంచుకోవచ్చునని కోనసీమలో నర్సరీల వాళ్లు అనుభవపూర్వకంగా చెప్తున్నారు. కొన్ని కంపెనీలు శుద్ధిచేసిన కొబ్బరి పొట్టు ఎరువును మార్కెట్లో విక్రయిస్తున్నాయి కూడా.

గజం వర్టికల్ గార్డెన్‌లో 288 మొక్కలు..!

ఒక్కో ఫ్రేమ్ (3 ఖాళీ కుండీలతో కలిపి) 570 గ్రాముల బరువు ఉంది. కొబ్బరి పొట్టులో చిన్న మొక్కను ఉంచిన తర్వాత ఒక్కో ఫ్రేమ్ బరువు కిలోన్నర ఉంది. అంటే మొక్క ఉన్న ఒక్కో కుండీ బరువు అర కేజీ అన్నమాట. 4 ఫ్రేమ్‌లను (అంటే 12 మొక్కలను) అమర్చేందుకు 3 అడుగుల స్థలం సరిపోతుంది. 16 ఫ్రేమ్‌లను గుండ్రంగా అమర్చి.. వాటిపై 6 వరుసలుగా ఫ్రేమ్‌లను నిలువుగా బిగిస్తే (288 కుండీలతో).. చదరపు గజం స్థలంలోనే దాదాపు 9 అడుగుల ఎత్తులో ‘పెరటి మొక్కల పొద’ (వర్టికల్ గార్డెన్) తయారవుతుంది. గుండ్రంగా ఉండే ఈ ‘పెరటి మొక్కల పొద’ను అన్ని వైపుల నుంచి ఎండ తగిలే వీలున్న ఆరుబయటో, మేడ మీదో ఏర్పాటు చేసుకుంటే బావుంటుంది.

వాల్ గార్డెన్ సంగతి..
ఫ్రేమ్‌లను రెండు వరుసలుగా ప్లైవుడ్‌కు బిగిస్తే వాల్ గార్డెన్ సిద్ధం. ఉదయం గాని, మధ్యాహ్నం నుంచి గాని రోజుకు ఐదారు గంటలు ఎండ తగిలే చోట గోడకు ఆనించిన ప్లైవుడ్‌కు ఫ్రేమ్స్ బిగించి కుండీలు పెట్టుకుంటే చాలు. ఆకుకూరలు, కూరగాయల సాగుకు ఈ చిన్న కుండీలు భేషుగ్గా ఉంటాయనడంలో సందేహం లేదు.

విలక్షణమైన గ్రీన్‌వాల్

మరో విలక్షణ నమూనా వాల్ గార్డెన్‌ను కూడా ఈ కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. 16 మొక్కలు పెంచుకోవడానికి వీలుగా ఉండే ట్రే(మాడ్యూల్)లను తయారుచేసింది. 12.5 సెంటీమీటర్ల మందాన ఉండే ట్రేలో కొబ్బరి పొట్టు లేదా మట్టి, కంపోస్టు మిశ్రమం పోసి మొక్కలు పెట్టుకున్న తర్వాత.. దాన్ని గోడ పక్కన నిలబెట్ట వచ్చు. ఆకాశం వైపు చూడాల్సిన మొక్కలు... అడ్డంగా వంగి పక్కకు పొడుచుకొచ్చినట్టుంటాయి. ట్రేని అలాగే ఉంచి పై నుంచి లోపలికి నీరు పోయవచ్చు.

‘అన్‌బ్రేకబుల్ మెటీరియల్‌తో తయారుచేశాం’

(12 కుండీలను కలిగి ఉండే) 4 ఫ్రేమ్‌ల ప్యాకెట్ ఖరీదు పన్నులతో కలిపి రూ.900. రవాణా ఖర్చులు, ఆక్ట్రాయ్ అదనం. మొదటి ఎక్స్‌పోలోనే తమ ఉత్పత్తులు హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయాయని జేకేడీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ యజమాని కుమార్‌పాల్ షా ‘ఇంటి పంట’ ప్రతినిధితో చెప్పారు. బయో వాల్‌ను ఎండలో పెట్టుకున్నా ఏళ్ల తరబడి మన్నిక ఉండేలా, అన్‌బ్రేకబుల్‌గా, నాణ్యంగా తయారుచేశామని ఆయన తెలిపారు. తమకు దేశంలో ఎక్కడా డీలర్లు లేరని, వినియోగదారులు తమను నేరుగా (022- 23713340, 32923340) సంప్రదించవచ్చన్నారు.

మేడపైనే కూరగాయల మడి!

విష రసాయనాల అవశేషాలతో కూడిన కూరగాయలు, ఆకుకూరలను మార్కెట్‌లో కొనుక్కొని తినడం కన్నా... ఉన్నంతలో తమకు తామే పండించుకోవడమే మిన్న అనే చైతన్యం పట్టణ ప్రాంత వినియోగదారుల్లో క్రమంగా పరివ్యాప్తమవుతోంది. నగరాల్లో, పట్టణాల్లో స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్న గృహయజమానులు ఇంటి దగ్గరే పండించుకోవడానికి తమకు తగిన ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు. ఈ దిశగా అక్కడక్కడా కొందరు ఇప్పటికే ముందడుగు వేశారు. ఇంటి చుట్టూ పెద్దగా స్థలం లేని పరిస్థితి ఉన్నా... ఇంటిపైనే ప్రత్యేక మడులు ఏర్పాటు చేసుకొని కూరగాయలు, ఆకుకూరలు ఎంచక్కా పెంచుతున్నారు.

తమ కుటుంబ ఆరోగ్యం కోసం రసాయనాలు వాడకుండా సహజ సేద్యం చేస్తున్నారు. అంటే.. ఇళ్లమయం అయిపోయిన నగరాలు, పట్టణాల్లోనూ పక్కా ఇళ్ల పైనే వ్యవసాయ క్షేత్రాలు కొలువుదీరడం ప్రారంభమైందన్న మాట. ఇలా ఇంటిపైనే కూరగాయల మడిని నగరాలు, పట్టణాల్లో నివాసం ఉండే వారే కాదు.. పల్లెల్లో పక్కా భవనాల్లో ఉండే వాళ్లూ ఏర్పాటుచేసుకోవచ్చు. పొలంలో పంటలు పండించే వాళ్లయినా.. అవి ఏడాది పొడుగునా అందుబాటులో ఉండవు కాబట్టి... ఇంటి పట్టున కూడా ఆకుకూరలు, కూరగాయలు పండించుకోవచ్చు.

మడుల్లో సమృద్ధిగా ఆకుకూరలు, కూరగాయల సాగు
నగరాలు, పట్టణ ప్రాంతవాసుల్లో ఆరోగ్య స్పృహ విస్తృతమవుతున్నకొద్దీ రోజువారీ ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల వాడకం పెరుగుతోంది. అన్నం తక్కువగా.. కూరగాయలు ఎక్కువగా వాడాలన్న చైతన్యం పెరుగుతోంది. ఎక్కడో దూరాన ఎటువంటి నీటితో, ఎటువంటి విష రసాయనాలు విచ్చలవిడిగా వాడి పండిస్తున్నారో తెలియని కూరగాయలు, ఆకుకూరలు తినడం కన్నా... మొదట్లో కొంచెం శ్రమ అనిపించినా.. ఇంటిపైన ఉన్న ఖాళీని పొలంగా మార్చుకునే సులువైన మార్గాలను అన్వేషిస్తున్నారు. బియ్యం తదితర ఆహార ధాన్యాలైతే నగరాల్లో నమ్మకమైన సేంద్రియ దుకాణంలో కొంచెం ఖరీదైనా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. లేదంటే.. గ్రామాల నుంచి నెలకోసారో, రెండు నెలలకోసారో తెప్పించుకోవచ్చు. అయితే.. విష రసాయనాలు వాడకుండా సహజంగా పండించిన కూరగాయలు, ఆకుకూరలు ఎక్కడో, ఎప్పుడో గాని దొరకని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది.

దీన్ని అధిగమించడానికి ఎవరికి వాళ్లు ఇళ్లపైనే ప్రత్యేకంగా మడులు ఏర్పాటు చేసుకోవడమే ఉత్తమమన్న భావం నగరవాసుల్లో అంతకంతకూ ప్రబలమవుతోంది. కుండీల్లోనూ ఆకుకూరలు, కూరగాయలు పెంచుతున్నా.. టెరస్‌ప్రై ఖాళీని ఉపయోగించి కుటుంబానికి సరిపడా సమృద్ధిగా పండించుకోవచ్చన్న ఆలోచన మడుల ఏర్పాటుకు దారితీస్తోంది. కుటుంబ ఆరోగ్యం రక్షించుకోవడం కోసం.. కొంచెం శ్రమ అనిపించినా మేడపైనే కుండీలతోపాటు వీలైనన్ని మడులు ఏర్పాటు చేసుకుంటున్నారు.

ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న మట్టి, కంపోస్టు, కొబ్బరి పొట్టు మిశ్రమం వాడితే.. బరువుకు బరువూ తగ్గుతుంది.. పోషకాలు పుష్కలంగా అందుతాయి... కాబట్టి దిగుబడికి దిగుబడీ బాగా వస్తుంది.

శ్లాబ్ లీకవుతుందేమో..!
మేడపైన కూరగాయల మడి ఏర్పాటుచేసుకుంటే నీటి వల్ల శ్లాబ్ దెబ్బతింటుందేమోనన్న సందేహం అక్కర్లేదని అంటున్నారు సికింద్రాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన స్వచ్ఛంద కార్యకర్త మురళి. ఆయన తన ఇంటిపైన మడిలో ఆకుకూరలు ఏడాది క్రితం నుంచే పుష్కలంగా పెంచుతున్నారు. అధికంగా వర్షాలు కురిసినా ఇబ్బందేమీ రాలేదన్నారు. అయితే... ఇక్కడ ఒక విషయం గమనించాలి. బాగా పాతపడిన ఇళ్లు, చాలా ఏళ్ల క్రితం పిల్లర్లు వేయకుండా శ్లాబ్ వేసిన ఇళ్లపై మడిని ఏర్పాటుచేసుకునేటప్పుడు ఇంజనీర్ సలహా తీసుకోవడం ఉత్తమం.

ఎండాకాలం..

మేడ మీద కూరగాయల మడి అనగానే ఎండాకాలం వస్తుంటే ఇప్పుడెలా? అనుకునేరు. ఆకుకూరలు 30, 40 రోజుల్లో వచ్చేస్తాయి. టమాటా, వంగ మొక్కలు నాటినా.. మరీ ఎండలు ముదురుతున్నప్పుడు గ్రీన్ షేడ్ నెట్ ఏర్పాటు చేసుకుంటే సరి! 35 డిగ్రీల సెల్షియస్ వరకూ కూరగాయలకు, ఆకుకూరలకు (క్యాబేజీ, క్యారట్, బీట్‌రూట్ వంటి కొన్ని నీడను కోరుకునే మొక్కలకు తప్ప) ఇబ్బంది ఉండదు. గ్రీన్ షేడ్ నెట్ కింద కనీసం పది, పదిహేను డిగ్రీల ఎండ తక్కువగా ఉంటుంది. కాబట్టి నెట్ ఏర్పాటు చేసుకుంటే ఎండాకాలం ముదిరినా ఏ పంటలైనా నిక్షేపంగా పండించుకోవచ్చు. వేసవి సెలవులకు ఊరు వెళ్లేటప్పుడు మడిని ఎవరో ఒకరికి అప్పగించి వెళ్లవచ్చు. లేదా అప్పటికల్లా పూర్తయ్యే ఆకుకూరలు, కొత్తిమీర, పుదీన.. మడిలో వేసుకోవచ్చు. తిరిగి వచ్చాక మళ్లీ ప్రారంభించవచ్చు.

గార్డెనింగ్‌తో ఆహ్లాదం

నగర వాసులకు కాస్తంత ప్రశాంతత చేకూర్చే స్థలాలు పార్కులు. ఆపార్కులలో గమనిస్తే పచ్చటి ఆకారాలు కొన్ని కనిపిస్తాయి. కాసేపు చూడాలనిపిస్తుంటుంది. అటువంటివి మన ఇంటి వద్ద కూడా ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది. ఇంటిముందు స్థలం ఉంటే ఇదేం పెద్ద కష్టం కాదంటున్నారు గార్డెనింగ్‌లో మెళకువలు కలిగినవారు. తక్కువ ఖర్చుతో పచ్చని తీగలతో ఆకట్టుకునే ఆకృతులను రూపొందించవచ్చని వారు చెబుతున్నారు.

gardeningఅవకాశం వుంటే ఇంట్లోనే చిన్న సైజ్‌ గార్డెన్‌ను ఏర్పాటు చేసు కోవాలని కొందరు కోరుకుంటారు. ఇటువంటి వారి అభిరుచికి తగ్గట్టుగా నేడు గార్డెనింగ్‌ అత్యంత ప్రాధాన్యతను సంతరిం చుకుంది. చాలామంది నగరవాసులు తమకున్న కొద్దిపాటి స్థలంలో వివిధ ఆకృతులను రూపొం దించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాం టి వారికోసం గార్డెనింగ్‌లో కొన్ని మెళకువలను పాటిస్తే చాలంటున్నారు గార్డెనింగ్‌ నిపుణులు.

స్థలానికి అనుగుణంగా...
మనకున్న స్థలానికి అనుగుణంగా ఆవరణకి అం దం తెచ్చేలా ఆకృతులను (వివిధ జంతువులు, ఆ కారాలు ) ఎంపిక చేసుకోవడంతో ఈ ప్రక్రియ ప్రారంభ మవుతుంది. తరువాత బొమ్మలను తయారుచేయడానికి అనువైన మొక్కలను ఎంచుకో వాలి. వాటికి ఎటువంటి తెగు లు రాకుండా ముందు జాగ్ర త్తగా ఎరువులు, జంతువుల బారినుంచి కాపాడేందుకు కంచెను ఏర్పాటు చేసు కోవాలి. ఇక నీటి నిల్వకు ఏర్పాట్లుచేసుకొని మొక్కలను నాటాలి.

ట్రిమ్మింగ్‌ చేసుకోవాలి...
plantation-gardeningమొక్కలు ఎదిగిన తర్వాత ఆకృతులను మలిచే టప్పుడు మనలోని కళా హృదయాన్ని తట్టిలేపాలి. మనకు ఏవంటే ఇష్టమో మన ఇంటికి ఎటువంటి ఆకృతులు నచ్చుతాయో తెలుసుకుని ఆ ఆకారా లు వచ్చే విధంగా ట్రిమ్మింగ్‌ చేసుకోవాలి. అవసర మనుకుంటే ముందుగానే ఒక పేపరు మీద మనం రూపొందించాల్సిన బొమ్మను స్కెచ్‌ వేసుకోవడం మంచిది. పార్కుల్లో ఉండే విధంగా పెద్దవిగా ఉంటే ఇంటిముందు బాగుండదు కనుక ముద్దుగా ఉండే చిన్నపాటి ఆకృతులను ఎన్నుకోవాలి. అప్పుడే ఇంటి ముందు ఆవరణ అందం గా తయారవుతుంది.

ఎవరికైనా నచ్చుతుంది...
‘నాకు చిన్నప్పటినుంచి గార్డెనింగ్‌ అంటే చాలా ఇష్టం. నేను అమెరికాలో చదువు తున్నప్పుడు నేనుండే ఇంటిముందు ఉండే గార్డెన్‌ ఎంతో అందంగా ఉం డేది. రకరకాల పూల చెట్లతో పా టు, విభిన్న ఆకృతులను కూడా రూ పొందించారు. అక్కడ ఆ తోటను చూసినప్పుడు నా ఆసక్తి మరింత పెరిగింది.ఇండియాకు రాగానే మా ఇంటిముందుండే కొద్దిపాటి స్థలం లో మొక్కలు నాటి నాకిష్టమైన ఆకారాలను రూపొందించుకున్నా ను. అందుకు అవసరమైన సమాచారాన్ని, మెళు కువలను వేరేవాళ్లను అడిగి తెలుసుకున్నాను. నన్నుచూసి పక్కవారుకూడా అలాగే తయారు చేసుకోవడం మొదలు పెట్టారు.ఇవి పిల్లలనే కా కుండా ఎవరికైనా నచ్చుతాయి ’అని శ్రావ్య అన్నారు. వాటిని పెంచడం బ్రహ్మ విద్యేం కాదని అనుభవం ఉన్నవారు చెప్తున్నారు.

Friday, January 28, 2011

ఆకర్షిస్తున్న ‘వర్టికల్ గార్డెన్’!

హైదరాబాద్‌లో జరుగుతున్న హార్టికల్చర్ ఎక్స్‌పోలో పచ్చని పొదలాంటి ‘వర్టికల్ గార్డెన్ సిస్టం’ చూపరులను ఆకర్షిస్తోంది. మొక్కలతో కూడిన చిన్న చిన్న కుండీలను ఒక ప్లాస్టిక్ స్టాండ్‌కు చుట్టూతా అమర్చితే ఈ ‘పొద’ ఏర్పడింది. అదేవిధంగా గోడకు తగిలించిన ‘బయో వాల్’ కనిపించింది.

గోడకు లేదా ప్లైఉడ్‌కు మేకులు కొట్టి అమర్చిన కుండీల సముదాయం అది. అపార్ట్‌మెంట్లలోని బాల్కనీల్లో, మేడపైన కూడా వీటిని అమర్చుకొని కూరగాయల మొక్కలు, ఆకుకూర మొక్కలను హాయిగా పెంచుకోవచ్చు. ముంబైకి చెందిన జేకేడీ ఎంటర్‌ప్రైజెస్ స్టాల్‌లో మెరిసిన ఈ కొత్త ఆలోచన భలే ఉంది కదండీ...!

Thursday, January 27, 2011

ఆకుకూరల సాగు .... అపార్ట్‌మెంట్లలో... ఇంటి పంట.

నగరాలు, పట్టణాలు...
అపార్ట్‌మెంట్లలో...
కుండీలు,
కంటెయినర్లలో..

వంగ, టమాటా వంటి కూరగాయలు కూడా పెంచవచ్చు
కుండీల్లోనూ చక్కని దిగుబడి తీయొచ్చు
ర్యాక్‌లతో తక్కువ చోటులోనే ఎక్కువ కుండీలు పెట్టొచ్చు

నగరాలు, పట్టణాలలో జనాభా సాంద్రత అంతకంతకూ ఎక్కువవుతోంది. ఇళ్లు, బహుళ అంతస్థుల గ్రూప్ హౌస్‌లు లేదా అపార్ట్‌మెంట్ల వద్ద ఖాళీ స్థలం తక్కువగా ఉంటుంది.

కంటికి మట్టి కనపడకుండా అంతా గచ్చుమయంగా ఉండే ఇటువంటి చోట్ల ఆకుకూరలు, కూరగాయలు పెంచుకోవడం అసాధ్యమని అనిపించడం సహజం. అయితే, అందుకు అనేక మార్గాలున్నాయి. ఇంటి యజమానులకే కాదు, అద్దె ఇంట్లో ఉండే వారితోపాటు పల్లెవాసులు సైతం కుండీలు, కంటెయినర్లలో మొక్కలు పెంచుకోవచ్చు. ఇంటి ముందు, వెనుక, బాల్కనీలో, మేడ మీద.. కిచెన్ గార్డెన్ పెంచవచ్చు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు కూడా.

మొక్కను బట్టి కుండీ: ఆకు కూరలు పెంచడానికి వెడల్పు ఎక్కువ, లోతు తక్కువ కుండీలు, కంటెయినర్లు సరిపోతాయి. కూరగాయ మొక్కలు, క్యారట్ వంటి దుంప జాతి మొక్కలు పెంచుకోవాలంటే లోతు ఎక్కువగా ఉండే కుండీలు, కంటెయినర్లు ఎంచుకోవాలి. ఆకు కూరలు పెంచుకోవాలంటే కనీసం 4 అంగుళాల లోతు మట్టి పట్టే వెడల్పాటి కుండీలు లేదా అంత లోతుండే బల్లపరుపు ట్రేలను ఎంచుకోవాలి.

వంగ, చిక్కుడు, టమాటా వంటి కూరగాయలు, బీర, పొట్ల వంటి తీగజాతి కూరగాయలు పెంచుకోవాలంటే 4 నుంచి 6 అంగుళాల లోతు మట్టి ఉండే కుండీలు, ట్రేలను ఎంపికచేసుకోవాలి. క్యారట్, ముల్లంగి వంటి దుంప జాతి మొక్కలు పెంచుకోవాలంటే మరికొంత లోతు ఉండే కుండీలు, కంటెయినర్లు ఎంచుకోవాలి.

కుండీలు: సిమెంటు, మట్టి, ప్లాస్టిక్ కుండీల్లో కూరగాయలు పెంచవచ్చు. చెక్కతో చేసిన పెట్టెలు, ప్లాస్టిక్ జార్లు, క్యాన్లు, బక్కెట్లు, టిన్ బాక్సులు, డ్రమ్ములలో మొక్కలు నిక్షేపంగా పెంచుకోవచ్చు.

అంతేకాదు అల్యూమినియం లేదా ఫైబర్‌తో తయారుచేసిన నలుచదరపు కంటెయినర్లలోనూ పెంచుకోవచ్చు. కుండీలతో ఉండే సౌలభ్యం ఏమిటంటే ఎంత సైజులో కావాలంటే అంతసైజువి ఎంపికచేసుకోవచ్చు. ఏ కుండీలో ఏ మొక్కలు పెంచదలచుకున్నామన్న దాన్ని బట్టి... కుండీ షేపు, లోతు, వెడల్పు, సైజు ఎంత ఉంటే బావుంటుందన్న విషయం నిర్ధారించుకోవచ్చు.

తగుమాత్రంగానే నీరు: మొక్కలకు తగుమాత్రంగానే నీరు పోయాలి. కుండీలో మట్టి బాగా తడిగా ఉంటే ఆ రోజుకు నీరు పోయనక్కర లేదు. మట్టి తేమగా ఉంటే చాలు. మరీ నీరు ఎక్కువైనా మొక్క చనిపోతుంది. అతి జాగ్రత్తగా నీరు మరీ ఎక్కువ పోస్తే.. నాటిన చేతులతో మనమే మొక్కను చంపుకున్నవాళ్లమవుతాం.

నిలువ నీరు హానికరం: ఎక్కువైన నీరు కుండీలో లేదా కంటెయినర్‌లో నిలవకుండా చూసుకోవాలి. ఇందుకోసం కుండీ లేదా కంటెయినర్ అడుగున కనీసం ఒక రంధ్రమైనా ఉండాలి. సాధారణంగా కుండీకి రెండు, మూడు రంధ్రాలుంటాయి. పొడవాటి ట్రేలు, కంటెయినర్లకు మరిన్ని రంధ్రాలు పెట్టాలి. కుండీలో నీరు నిల్వ ఉంటే ఎక్కువ సేపు తేమ ఉంటుంది అని అనుకోవడం మొక్క మనుగడకే ప్రమాదం. మొక్కల పనులు చేయాలంటే పిల్లలు సరదా పడుతుంటారు. ఏ కుండీలో ఎంతెంత నీరు పోయాలో పిల్లలకు నేర్పండి. మర్చిపోకుండా క్రమం తప్పకుండా పోస్తారు. తాము పోసిన నీరుతో మొక్క రోజుకో తీరున పెరుగుతుంటే చూసి వారు పొందే ఆనందం అంతా ఇంతా కాదు.

ఒకే కుండీలో రెండు రకాల మొక్కలు: కుండీ ఒకటే అయినా రెండు రకాల మొక్కలు పెంచుకోవచ్చు. ఉదాహరణకు... వంగ మొక్కలు రెండు ఒక కుండీలో పెట్టామనుకోండి. అది రెండు జానల ఎత్తు పెరిగిన తర్వాత... అదే కుండీలో వంగ మొక్క చుట్టూ ఉండే ఖాళీలో కొత్తిమీర, పుదీన, మెంతి కూర, అల్లం... వంటి ఎత్తు తక్కువ పెరిగే మొక్కలేవైనా వేసుకోవచ్చు.

తక్కువ చోటులో ఎక్కువ కుండీలు: కుండీలు ఇండిపెండెంట్ ఇళ్లు లాంటివి. ఇంటి దగ్గర ఉన్న కొంచెం ఖాళీ కొన్ని కుండీలతోనే నిండిపోతుంది. అలాంటప్పుడు అపార్ట్‌మెంట్ల మాదిరిగా బహుళ అంతస్థుల్లో మొక్కలు పెంచుకునే ఉపాయం ఆలోచించవచ్చు. చెట్టు ఆకారంలో ఇనుప చువ్వలతో ర్యాక్ చేయించుకుంటే... ఒకటి రెండు కుండీలు పట్టే చోటులోనే ఐదారు కుండీలు మోసే ‘ఇనుప చెట్టు’లాంటి ర్యాక్‌ను పెట్టుకోవచ్చు.

మీ ఇంటి పరిసరాలను దృష్టిలో ఉంచుకొని.. మీకు అందుబాటులో ఉన్న మెటీరియల్‌తో.. మరో విధంగా ఏమైనా చేయొచ్చేమో కూడా ఆలోచించండి.

మట్టి.. ఎరువులు: నాణ్యమైన మట్టి, సేంద్రియ ఎరువుల మిశ్రమాన్ని వినియోగిస్తే కూరగాయ మొక్కలు పోషకలోపం లేకుండా చక్కగా పెరిగి మంచి దిగుబడినిస్తాయి.

కుండీలో మట్టి పిడచగట్టుకు పోకుండా ఉంటే మొక్క చక్కగా పెరుగుతుంది. నల్లమట్టికి గట్టిపడే స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి ఎరమ్రట్టిని వినియోగించడం మంచిది. ఎరమ్రట్టి బొత్తిగా దొరకనప్పుడు నల్లమట్టిని తక్కువ పాళ్లలో వాడుకోవచ్చు. కూరగాయలు, ఆకుకూరల పెంపకానికి సేంద్రియ ఎరువులు, సేంద్రియ పురుగుమందుల వాడకం ఉత్తమం. ఎరమ్రట్టికి, పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు సమపాళ్లలో కలిపి మొక్కలు పెంచవచ్చు. వేప గింజల పిండి, కానుగ పిండి, సీతాఫలం గింజల పిండి కూడా కలిపితే చీడపీడలను నివారించుకోవచ్చు.

కొబ్బరి పీచుతో...: కొబ్బరి పీచు తీసినప్పుడు వచ్చే పొట్టు కూడా చక్కని సేంద్రియ ఎరువే. మట్టి లేకుండా కేవలం కొబ్బరి పొట్టును వాడి ప్లాస్టిక్ ట్రేలలో నారు పెంచుతున్నారు. 40 రోజులపాటు ఆరోగ్యంగా మొక్కలు పెరుగుతున్నాయి. అంటే.. ఆకుకూరలు కూడా ఈ ట్రేలలో కొబ్బరి పీచుతో పెంచుకోవచ్చు.

కంపోస్టుతోనే..: మట్టితో పని లేకుండా వట్టి కంపోస్టుతో కూడా కూరగాయలు, ఆకుకూరల మొక్కలు పెంచుతున్నారు. మట్టితో పెంచినదానికన్నా కనీసం 3 రెట్లు అధిక దిగుబడి వస్తున్నదని అనుభవజ్ఞులు చెప్తున్నారు. కంపోస్టుతో జీవన ఎరువులు కలిపిన మిశ్రమంతోనూ ఆకు కూరలు, కూరగాయలు పెంచుకోవచ్చు.

విత్తనాలు: విత్తనాలు దుకాణాల్లో చిన్న ప్యాకెట్లలో కూడా అమ్ముతున్నారు. ఇరుగుపొరుగు వారి వద్ద నుంచో,పెరటి తోటలు పెంచే వారి దగ్గరి నుంచో సేకరించుకోవచ్చు. తోటకూర వంటి అతిచిన్న విత్తనాలను ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు. మొత్తం మడిలా చల్లవచ్చు లేదా సాళ్ల మాదిరిగా చల్లవచ్చు.

ఆకుకూరలు సాధారణంగా చల్లిన నెల రోజుల్లో కోతకు వస్తాయి. పాలకూర, బచ్చలి కోస్తే మళ్లీ మొలకలు పెరుగుతాయి. తోటకూర కూడా మొలకలు పెరుగుతాయి. కానీ అంత నాణ్యంగా రావని అంటుంటారు. గోంగూర మొక్క నుంచి నెలల తరబడి ఆకులు కోసుకోవచ్చు.

ఏడాది పొడవునా పెంచవచ్చు: కూరగాయలు, ఆకుకూరలను ఏడాది పొడవునా పండించవచ్చు. అన్ని రకాల ఆకుకూరలు, వంగ, టమాటా, బెండ, క్యాప్సికమ్, మిరప, బీట్‌రూట్, క్యాలీఫ్లవర్, పుచ్చ... రకాలను నిశ్చింతగా సాగుచేయవచ్చు. కొత్తిమీర, కరివేపాకు, పుదీన వంటి వాటి గురించి ఇక ఆలోచించాల్సిన పనే లేదు.
ఎండ: అయితే.. ఏ మొక్కలకైనా ఎండ తగిలితేనే చక్కగా పెరుగుతాయి. రోజుకు కనీసం 5, 6 గంటల సేపైనా ఎండ తగిలే విధంగా కుండీలు, కంటెయినర్లను ఏర్పాటు చేసుకోవాలి.

ప్రతి 15 రోజులకోసారి మట్టిని గుల్లపరిచి గుప్పెడు వర్మీ కంపోస్టు లేదా పశువుల ఎరువు వేస్తే మంచిది. పంచగవ్య, వర్మివాష్ వంటి ద్రావణాలను 15 రోజలకోసారి చల్లితే చీడపీడలు దరిచేరవు.. పోషకాలు కూడా అందుతాయి.

ఏవైనా పురుగులు కనిపిస్తే వాటిని ఓపిగ్గా ఏరేయండి. ఒక కొమ్మకు తెగులు సోకితే ఆ కొమ్మ వరకూ కట్ చేసి నాశనం చేయడం శ్రేయస్కరం. ఎండలు ముదురుతున్నాయి కదా అని సందేహించకండి. ఏడాది పొడవునా అన్నికాలాల్లోనూ ఆకుకూరలు, కూరగాయలు పెంచుకోవచ్చు.