Monday, February 14, 2011

కూరగాయల మడి.. పెట్టుకుందామా?


పట్నమైనా, పల్లె అయినా.. పెరట్లోనో, మేడ మీదో ఇంటిల్లిపాదికీ వంటకు సరిపోయే కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవాలనుకుంటే.. కొన్ని కుండీలతో పాటు ఒకటో రెండో మడులు కూడా ప్రతి ఇంటి వద్దా ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఇంట్లో కూరగాయల వాడకాన్ని బట్టి ఎన్ని కుండీలు, ఎన్ని మడులు అవసరమవుతాయో ఏ కుటుంబానికి ఆ కుటుంబమే గ్రహించాలి.

అవసరమయ్యే మొత్తం ఒకేసారి పండించుకోలేకపోయినా.. వీలున్నంతలో ముందు ఒక మడి ఏర్పాటుచేసుకోవడానికి ప్రయత్నించండి. విష రసాయనాల్లేకుండా పెరిగిన ఇంటి పంట రుచి తెలిశాక.. ఇంట్లోకి పూర్తిగా సరిపోను ఇంటిపట్టునే పండించుకునే ఏర్పాటు చేసుకోవచ్చు.


మడి 4 అడుగుల వెడల్పుంటే చాలు..

పెద్ద వారికి రోజుకు 300 గ్రాముల కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు అవసరం. పోషక విలువల రీత్యా దుంపలు, కూరగాయలకన్నా ఆకుకూరలే కాస్త ఎక్కువ తీసుకోవాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మడుల్లో అధిక స్థలం ఆకుకూరల పెంపకానికి కేటాయించుకోవడం ఉత్తమం. కూరగాయల మడి వెడల్పు 4 అడుగులు ఉంటే చాలు. మడి దగ్గర కూర్చొని చేయి చాపితే.. మడి అవతలి అంచు అందేలా ఉంటే చాలు. ఉన్న చోటును బట్టి మడి వెడల్పు తగ్గించుకోవచ్చు. పొడవు ఎంతైనా పెట్టుకోవచ్చు.

మేడపై మడి ఇలా..

పెరట్లో వేసే మడులకు, ఇంటిపైన పెట్టుకునే మడులకు చిన్న తేడా ఉంది. పెరట్లో (అంటే నేల మీద) ఏర్పాటు చేసుకునే మడికి.. వర్షపు నీటి కోత నుంచి ప్రత్యేక రక్షణ అవసరం. మేడ మీద పాలిథిన్ షీట్ పరిచి.. దానిపై చుట్టూ మూడు వరుసలు ఇటుకలు పేర్చి.. మట్టి, కంపోస్టు తదితరాలతో ప్రత్యేకంగా సిద్ధంగా చేసుకున్న మట్టి మిశ్రమాన్ని పోస్తే.. మడి సిద్ధమైనట్టే.

పెరట్లో మడి ఇలా..

పెరట్లో మడిని ఏర్పాటు చేసుకునే స్థలాన్ని గుర్తించిన తర్వాత.. ఆ స్థలంలో ఇటుకలను బల్లపరుపుగా పరవాలి. ఆ ఇటుకల పైన.. చుట్టూ అంచుల్లో ఒక వరుస ఇటుకలు పేర్చాలి.

ఆ ఇటుక మేరకు 3 అంగుళాల మందాన మామూలు మట్టి పోయాలి(ఈ మట్టి మడి అడుగున దన్నుగా ఉండడానికి మాత్రమే. అందులో మొక్కలు వేసేదేమీ ఉండదు. ఆపైన వేసే మట్టి మిశ్రమంలోనే మొక్కలను సాగు చేస్తామన్న మాట). ఆ మట్టిపైన పాలిథిన్ షీట్ పరవాలి. వర్షపు నీరు ఉధృతంగా మడి సమీపంలో పారినా.. మడి అడుగున మట్టి కోసుకుపోకుండా ఈ ఏర్పాటు చేసుకోవాలి. అలా పరచిన పాలిథిన్ షీట్‌పై చుట్టూ అంచుల్లో రెండు వరుసలు ఇటుకలు పేర్చాలి. మధ్యలో మట్టి మిశ్రమాన్ని పోస్తే.. పెరట్లో మడి సిద్ధమైనట్టే.


ఇటుకలే వాడాలనేం లేదు..

కొందరు ఇటుకలకు బదులు పల్చని చెక్కలు, బంగళా పెంకులు, నాపరాళ్లు.. ఏవి అందుబాటులో ఉంటే వాటిని అమర్చుకొని కూరగాయల మడులు సిద్ధం చేసుకుంటున్నారు. మనం ఏ మెటీరియల్ వాడినా.. నేలపై ఏర్పాటు చేసుకునే మడికి అడుగున వర్షపు నీటి ఉధృతిని తట్టుకునేలా ప్రత్యేక జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. మేడపై మడికి అడుగున పాలిథిన్ షీట్ వేస్తే చాలు. అడుగున గచ్చు ఉంటుంది కాబట్టి... అడుగున మట్టి కోసుకుపోవడమనే సమస్య మేడపై మడికి ఉండదు.

పాలిథిన్ షీట్‌కు బెజ్జాలు పెట్టాలి..

మడిలో మట్టి మిశ్రమానికి అడుగున వేసే పాలిథిన్ షీట్‌కు ముందుగానే అక్కడక్కడా దబ్బళంతో బెజ్జాలు పెట్టాలి. ఈ బెజ్జాలు ఎందుకంటే.. మడిలో మొక్కలకు తగు మాత్రంగా పోస్తే చాలు. మడిలో నీరు నిల్వ ఉంటే మొక్కలకు ముప్పు పొంచి ఉన్నట్టే. నీరు మడిలో ఏమాత్రం నిలబడిపోకూడదు. మిగిలిపోయే నీరు ఎప్పటిది అప్పుడు కిందికి వెళ్లిపోయే ఏర్పాటు.. కుండీకైనా.. మడికైనా ప్రాణావసరం. పాలిథిన్ షీట్‌కు జానకు ఒక చోట దబ్బళంతో బెజ్జం పెడితే సరిపోతుంది.

రెండేళ్ల వరకూ మడికి ఖర్చేమీ ఉండదు..

ఎరమ్రట్టి, కంపోస్టు (లీఫీ మౌల్డ్.. అంటే ఆకు ఎరువు లేదా వర్మీ కంపోస్టు), కొబ్బరి పొట్టు, వర్మిక్యులైట్, వేప పిండి.. తగిన పాళ్లలో కలుపుకొని మట్టి మిశ్రమాన్ని సిద్ధం చేసుకొని మడిలో వినియోగించాలి. రెండేళ్ల వరకూ ఈ మట్టి మిశ్రమంలో వరుసగా పంటలు పండించుకోవచ్చు. సకల పోషకాలు పుష్కలంగా ఈ మట్టి మిశ్రమంలో ఉంటాయి. కాబట్టే, మామూలు మట్టిలో కన్నా.. మట్టి మిశ్రమంలో పెరిగే మొక్కలు కనీసం 3 రెట్లు పంట దిగుబడులు వస్తాయి.

No comments: