
మహానగరంలో నివసించేవారు సైతం కొంచెం శ్రద్ధ ఉంటే చాలు ఆకుకూరలు, కూరగాయలను ఇంటి వద్దే పండించుకోవడం ఆరోగ్యదాయకమని అంటున్నారు రామిశెట్టి మురళి, రమా జ్యోతి దంపతులు (98497 99048). వరంగల్ జిల్లాకు చెందిన మురళి సికింద్రాబాద్‌లోని ఉప్పల్ ప్రశాంత్ కాలనీలో స్థిరపడ్డారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులతోపాటు కలుషిత వ్యర్థ నీటిని వినియోగించి పండిస్తున్న ఆకు కూరలు, కూరగాయలను మార్కెట్లో కొనుక్కొని తినడం ఆరోగ్యానికి హానికరమని గ్రహించి ఇంటి వద్దే సేంద్రియ సేద్యానికి ఉపక్రమించారు. స్వగృహంపైనే కొన్ని కుండీలతోపాటు ప్రత్యేకంగా ఆకుకూరల మడిని ఏర్పాటు చేసి.. కొనాల్సిన అవసరం లేకుండా.. పుష్కలంగా పండిస్తున్నారు.
వంగ, బెండ, టమాటా, చిక్కుడు...
ఇంటికి దగ్గర్లోనే ఉన్న ఖాళీ స్థలంలో కూడా వంగ, బెండ వంటి కూరగాయ మొక్కలు, ఉసిరి, దానిమ్మ, జామ తదితర ఫల వృక్షాలను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తోటకూర, పాలకూర, చుక్కకూర, టమాటా, చిక్కుడు, దోస, మిరప, కొత్తిమీర, పుదీన, కరివేపాకు, ఉల్లి బొందులు లేదా ఉల్లి కాడలు, గుమ్మడి తదితర పంటలు పండించుకుంటున్నారు. కొన్ని పూల మొక్కలు కూడా చక్కగా పెరుగుతున్నాయి. పాలకూర పెరిగినంత వేగంగా చుక్కకూర పెరగడం లేదన్నారు. ఎరమ్రట్టిలో కొంత మేరకు వర్మీ కంపోస్టు కలిపి మొక్కలు పెంచుతున్నామని మురళి తెలిపారు. గత మూడు నెలల్లో ఆకు కూరలు, టమాటాలు, కొత్తిమీర, పుదీన కొనాల్సిన అవసరం తమ (నలుగురు) కుటుంబానికి రాలేదన్నారు. వీటిని ఇరుగుపొరుగువారు, స్నేహితులు, బంధువులతో కూడా పంచుకుంటున్నామని, ఇది చాలా సంతృప్తినిస్తోందని రమాజ్యోతి అన్నారు. ప్రతి కుండీలోనూ రెండు మూడు రకాలను సాగుచేస్తున్నారు.
వంటింటి వ్యర్థాలతోనే కంపోస్టు
కంపోస్టు ఎరువును మొదట్లో కొన్నారు. ఆ తర్వాత ఇంట్లోనే కుళ్లడానికి అవకాశం ఉన్న వ్యర్థపదార్థాలతో కంపోస్టును తయారుచేస్తున్నారు. వంటింట్లో చెత్త కోసం రెండు పాత్రలు పెట్టారు.
కుళ్లడానికి అవకాశం ఉన్న కూరగాయల పండ్ల తొక్కలు, పుచ్చకాయ ముక్కలు, ఆకులు అలములు, వాడిన టీపొడి, పుచ్చిన, పాడైన కూరగాయలు వంటి వ్యర్థ ఘన పదార్థాలన్నీటినీ ఒక పాత్రలో వేస్తున్నారు. వీటిని ఇంటి బయట మూలన ఏర్పాటుచేసిన పాత బక్కెట్లో వేస్తున్నారు.
క్రమంగా అదే కుళ్లి కంపోస్టుగా మారుతోందని, నెలకోసారి తీసి మొక్కల కుండీల్లో వేస్తున్నామని మురళి చెప్పారు. పప్పులు, బియ్యం కడిగిన నీళ్లు వేరే బక్కెట్లో పోసి ఏరోజుకారోజు మొక్కలకు పోస్తున్నారు. చెత్తను కంపోస్టుగా మార్చుతూ.. ఆ ఎరువుతో మొక్కలు పెంచుతున్నారు. పాత స్నానపు తొట్టె ఏదైనా దొరికితే కంపోస్టు బెడ్‌ను మేడ మీద నీళ్ల ట్యాంకు అడుగున ఏర్పాటు చేద్దామనుకుంటున్నామని మురళి అన్నారు.
రసాయనాలు వాడలేదు
చిక్కుడుకు పేను సోకితే రసాయనిక పురుగుమందులు వాడలేదని, వావిలాకు కషాయం చల్లామన్నారు. వేప చెక్క(నీమ్ కేక్)ను రోజంతా నానబెట్టి ఆ కషాయాన్ని మొక్కలపై చల్లితే మట్టి ద్వారా వచ్చే తెగుళ్లు పోతాయని, మొక్కకు పోషకాలు కూడా అందుతాయని అన్నారు.
మేడపై మడితో ఇబ్బందేమీ లేదు
మేడపైన 4 అడుగుల వెడల్పు, 15 అడుగుల పొడవు గల ఆకు కూరల మడిని మురళి, రమాజ్యోతి దంపతులు ఏర్పాటు చేసుకున్నారు. చుట్టూ రెండు ఇటుకల ఎత్తున (6 అంగుళాలు) సిమెంటుతో కట్టించి.. ఎరమ్రట్టి మూడొంతులు, ఒక వంతు వర్మి కంపోస్టు, కొద్ది మొత్తంలో వేప పిండి కలిపి మడిని ఏర్పాటుచేశామని మురళి చెప్పారు.
వర్షాకాలంలో ఈ మడి వల్ల ఇంటి స్లాబ్ నుంచి గదిలోకి ఏమైనా ఊట దిగడం వంటి సమస్యేమీ రాలేదన్నారు. మడి అడుగున ప్లాస్టిక్ షీట్ కూడా వేయలేదన్నారు. శ్లాబ్ సాధారణంగా 6 అంగుళాల మందానే వేశామన్నారు. మడిలో మూడు నాలుగు రకాల ఆకు కూరలు సాగుచేస్తున్నారు. ప్రతి ఆకుకూర నాలుగు రోజులకోసారి కోతకొస్తున్నాయని, చెట్టును పీక కుండా పెరిగిన ఆకులను తెంపుకుంటున్నామని రమాజ్యోతి చెప్పారు. ఒకసారి విత్తనాలు వేస్తే మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుందన్నారు.





అవకాశం వుంటే ఇంట్లోనే చిన్న సైజ్ గార్డెన్‌ను ఏర్పాటు చేసు కోవాలని కొందరు కోరుకుంటారు. ఇటువంటి వారి అభిరుచికి తగ్గట్టుగా నేడు గార్డెనింగ్ అత్యంత ప్రాధాన్యతను సంతరిం చుకుంది. చాలామంది నగరవాసులు తమకున్న కొద్దిపాటి స్థలంలో వివిధ ఆకృతులను రూపొం దించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాం టి వారికోసం గార్డెనింగ్‌లో కొన్ని మెళకువలను పాటిస్తే చాలంటున్నారు గార్డెనింగ్ నిపుణులు.
మొక్కలు ఎదిగిన తర్వాత ఆకృతులను మలిచే టప్పుడు మనలోని కళా హృదయాన్ని తట్టిలేపాలి. మనకు ఏవంటే ఇష్టమో మన ఇంటికి ఎటువంటి ఆకృతులు నచ్చుతాయో తెలుసుకుని ఆ ఆకారా లు వచ్చే విధంగా ట్రిమ్మింగ్ చేసుకోవాలి. అవసర మనుకుంటే ముందుగానే ఒక పేపరు మీద మనం రూపొందించాల్సిన బొమ్మను స్కెచ్ వేసుకోవడం మంచిది. పార్కుల్లో ఉండే విధంగా పెద్దవిగా ఉంటే ఇంటిముందు బాగుండదు కనుక ముద్దుగా ఉండే చిన్నపాటి ఆకృతులను ఎన్నుకోవాలి. అప్పుడే ఇంటి ముందు ఆవరణ అందం గా తయారవుతుంది. 


